''పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, అయిదు..... '' అంతరిక్ష కేంద్రంలో రాకెట్ విడుదలకు సమయం దగ్గరవుతున్న కొద్దీ భావోద్రేకము పెరుగుతూ ఉంటుంది. మానవ సహిత రాకెట్ చంద్రునిలోనికి వెళ్ళుటకు సిద్ధంగా ఉంది. ఈ రోజు కొరకు ఎన్నో నెలల పాటు తీవ్రముగా సిద్ధం చేయబడింది. చివరి నిమిషము వరకు కూడా ఎన్నో తనిఖీలు చేయబడ్డాయి. మానవుల జీవితములతో ఇవి ముడిపడి ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం ఎంతో తీవ్రమైన పొరపాటు.
అంతరిక్షంలోనికి పంపించే రాకెట్ కంటే వివాహ జీవితము ఎంతో సాహసోపేతమైనది మరియు ఎంతో ప్రమాదకరమైనది కూడా. కాబట్టి నిర్లక్ష్యంగా లేక అజాగ్రత్తగా దీనిని సమీపించలేము. సిద్ధపాటు తప్పనిసరి.
వివాహ దినమునకు కొన్ని నెలలకు ముందు ఒక రోజున వివాహము గురించి ప్రకటిస్తే మంచిది(ఒకవేళ దీనిని ప్రధానము అని పిలువవచ్చు - పేరు అంత ప్రాముఖ్యమైనది కాదు). అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోబోతున్నారని ప్రజలకు ప్రకటించాలి. ఆ రోజు నుండి కూడా వివాహ దినము సమీపించే కొలదీ ఇద్దరు భాగస్వాములు కూడా భావోద్రేకములకు లోనగుట సహజమే. కానీ ఈ భావోద్రేకము వారు వివాహమునకు సిద్ధపడకుండా అడ్డుకోకూడదు.
ఈ ప్రధానము చేయబడుట లోని ముఖ్య ఉపయోగ మేమిటంటే వివాహమునకు ముందు ఒకరినొకరు కొంతవరకు తెలుసుకొనవచ్చును. ఇప్పుడు వారు స్వతంత్రంగా, భయము లేకుండా, పుకార్లకు తావు లేకుండా కలుసుకొనవచ్చును. కుటుంబ సభ్యుల గురించిన వివరములు కూడా తెలుసుకొనుటకు ఇది దోహదపడుతుంది. ఇది మన భారతదేశములో ఎంతో ప్రాముఖ్యము, ఎందుకంటే భారతదేశములో వివాహము అంటే భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కూడా ఎంతో దగ్గరి సంబంధములను కలిగియుండాలి.
తల్లిదండ్రులతో అనుబంధం
ఈ ప్రధానం అయిన కాలంలో భాగస్వాములిద్దరు కూడా తమ తల్లిదండ్రులతో ఉన్న బలమైన సంబంధమును తగ్గించుకొని ఇరువురు ఒకరితో ఒకరు గడుపుటకు సమయం లభిస్తుంది. వివాహం తరువాత కూడా తల్లిదండ్రుల యోగ క్షేమములను పట్టించుకోవడం సరియైనదే. ఇది లేఖనానుసారం కూడా. కాని వివాహం అయిన తరువాత కూడా ఒక్కరు కాని లేక ఇరువురు భాగస్వాములు ఒకరితో ఒకరు అనుబంధం కలిగియుండుట కంటే తల్లిదండ్రులతో ఎక్కువ అనుబంధం కలిగియుండుట వల్ల అనేక వివాహములు నాశనమయ్యాయి.
బయటకు వెళ్ళకుండా ఎప్పుడు ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉన్న వారికి ఇతరులతో పోల్చినట్లయితే ఈవిధమైన అనుబంధమును కలిగియుండుటకు ఎక్కువ అవకాశములు ఉంటాయి. కాని ఈ అంశం మీద బైబిలు యొక్క బోధ ఎంతో స్పష్టంగా ఉంది. ''కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏకశరీరమైయుందురు'' (ఆది 2:24). ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది(కీర్తనలు 45:10).
ఇద్దరు కలసి తిరుగుట
ప్రధానం అయిన తరువాత ఇద్దరూ కలసి తిరగడం, చుంబనాది చర్యలు(పెట్టింగ్) చేయడం సబబేనా? రెండవ అధ్యాయంలో ప్రస్తావించిన నియమములను మనస్సులో ఉంచుకోవాలి.
భారతదేశంలో ఇద్దరు కలసి బయటకు వెళ్ళడం అనేది నీవు పల్లెటూరులో నివసిస్తున్నావా లేక పట్టణంలో నివసిస్తున్నావా అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మీరిరువురు కూడా వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకోవడం, మాట్లాడాలనిపించడం సహజమే మరియు సరియైనదే. కాని దీన్నెంతో జ్ఞానయుక్తంగా చేయాలి. నీ చుట్టు ప్రక్కల ఉన్న సంప్రదాయమును నీవు గౌరవించాలి మరియు బుద్ధిహీనముగా ప్రవర్తించి నీ క్రైస్తవ సాక్ష్యమును పోగొట్టుకొనకూడదు. మీరిద్దరు కలసి ఒంటరి ప్రదేశమునకు వెళ్ళుట పుకార్లకు దారితీస్తుంది. అక్కడ లైంగిక సంబంధమైన శోధనలకు లోనవ్వకుండా కూడా మీరు జాగ్రత్తపడాలి.
చుంబనాది చర్యల విషయానికొస్తే, అది ఖచ్చితంగా తప్పే. ప్రధానం చేయబడటం అంటే లైంగిక చర్యకు లైసెన్స్(అనుమతి) ఇవ్వడం కాదు. ప్రతి దానికి కూడా సరియైన సమయం ఉంటుంది. కౌగలించుటకు, కౌగలించుట మానుటకు సమయము కలదు(ప్రసంగి 3:5). కౌగలించుకునే సమయం వివాహం తర్వాత ఉంటుంది. ఇక్కడ ఓపికతో ఉండండి, అప్పుడు మీ వివాహం ఎంతో సంతోషంగా ఉంటుంది మరియు పశ్చాత్తాపపడవలసిన అవసరం లేనిదిగా ఉంటుంది.
వివాహమునకు ముందు ఎవరైతే చుంబనాది చర్యలకు తావిస్తారో వారి వ్యక్తిగత సంబంధము తగ్గిపోవుటకు మరియు భావోద్వేగముల ఒత్తిడి పెరుగుదలకు అవకాశమిచ్చిన వారవుతారు. కలసి ప్రార్ధన చేసుకోవడం తొలగిపోతుంది(ప్రార్ధనను చుంబనాది చర్యలు తొలగిస్తాయి) మరియు వివాహమునకు ముందే సంయోగములో పాల్గొనే అవకాశము కూడా ఉంటుంది. ప్రధానం(నిశ్చితార్ధం) చెడిపోయే అవకాశం కూడా ఉంటుందని మనస్సులో ఉంచుకోవాలి. ఒకవేళ చుంబనాది చర్యల్లో పాల్గోన్నట్లయితే, నిశ్చితార్ధం చెడిపోయినట్లయితే అబ్బాయిని తన శరీరమును తాకనిచ్చినందుకు అమ్మాయి చింతించాల్సి ఉంటుంది. అందుకే, నేను రెండవ అధ్యాయంలో చెప్పినట్లుగా అబ్బాయి తొందరపడుతున్నట్లయితే అమ్మాయి బ్రేకులెయ్యాలి. ఎందుకంటే అబ్బాయి కంటే అమ్మాయే ఎక్కువ కోల్పోవలసి వస్తుంది. ఆవిధమైన చర్యలు చేయుటకు అనుమతించనట్లయితే ఒకవేళ ఆ అబ్బాయిని కోల్పోతానేమోనని ఆమె భయపడవలసినవసరం లేదు. ఒకవేళ అతడు వివాహం చేసుకొనుటకు యోగ్యుడైనట్లయితే, దానిని బట్టి అతడు అభ్యంతరపడడు. దానికి బదులుగా ఆమెను ఇంకా ఎక్కువగా గౌరవిస్తాడు. ఒకవేళ అతడు అభ్యంతరపడినట్లయితే, ఆమె వివాహం చేసుకొనుటకు అతడు యోగ్యుడు కాడని అది బయలుపరుస్తుంది.
అభిప్రాయ బేధములు మరియు ఇబ్బందులు
ప్రధానం జరిగిన తరువాత ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ బేధములు కలిగినట్లయితే, మనిద్దరము ఒకరికొకరము సరిపోతామా లేదా అని కొంతమంది అనుకుంటారు. ప్రధానము చేయబడిన తరువాత ఇక కొనసాగించాలా లేదా అని అనుకుంటారు. పెళ్ళయిన తరువాత తన భాగస్వామితో ఎటువంటి అభిప్రాయ బేధములు రావు అని అనుకుండే వ్యక్తి ఒక కలల ప్రపంచంలో జీవిస్తున్నాడు మరియు వాస్తవము ద్వారా కాక కేవలం కట్టుకథల ద్వారానే ప్రభావితం చేయబడుతున్నాడు. ఎంతో పరిపూర్ణమైన వివాహములలోను మరియు ఎంతో ఆత్మీయముగా ఉన్న వ్యక్తుల మధ్య కూడా చిన్న చిన్న అభిప్రాయబేధములుంటాయి.
కాబట్టి ఒకరికొకరము సరిపోమనో లేక ఇది దేవుని చిత్తము కాదనో ఇది సూచన కాదు. ఒకవేళ ఇదే నిజమైతే దేవుడు నిర్ణయించిన వివాహములు ఎక్కడా ఉండవు. చిన్న చిన్న విషయాలలో కూడా అభిప్రాయబేధములు రాకుండా ఉండే వివాహము ఎక్కడ ఉంటుందంటే అందులో ఎవరైనా ఒకరు స్వయం చిత్తం లేకుండా మరమనిషి(రోబో) వలె ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రధానం రద్దు చేసుకోవడానికి చిన్న చిన్న అభిప్రాయబేధములు కారణం కాకూడదు. దీనికి బదులు ఇద్దరు తగ్గించుకొని ఒకరినొకరు క్షమాపణ అడగగలిగినట్లయితే జీవితంలో ఇరువురికి ఇది ఎంతో ప్రయోజనకరమైన(ఆరోగ్యకరమైన) సూచనగా ఉంటుంది. స్త్రీ ఏవిధముగానైతే క్షమాపణ కోరుకొనుటకు సిద్ధంగా ఉంటుందో పురుషుడు కూడా అదేవిధముగా ఉండాలి. మన భారతీయ సమాజములో పురుషునికి ఇది అవమానకరముగా ఉంటుంది కాని ఒక క్రైస్తవునికి ఆ విధముగా ఉండకూడదు. ఏ పురుషుడైతే తన భార్యకు క్షమాపణ చెప్పుటకు సిద్ధంగా ఉండడో అతడు వివాహం చేసుకోకూడదు.
కొన్ని ఇతర విషయాల వల్ల ప్రధానం అయిన తరువాత పెళ్ళి జరగడానికి కొంత జాప్యం కలుగవచ్చు. ఆ సమయంలో కొన్ని చిక్కులు కలగడం, కొంత బాధాకరంగా ఉండటం సహజం. ఆర్ధిక సమస్యలు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం మొ||నవి ఇద్దరికీ బాధను కలిగించవచ్చు. ఇలాంటివి నిరాశను, నిరుత్సాహమును కలిగించునట్లు మనము అనుమతించకూడదు. దీనికి బదులు అవి ప్రేమ యొక్క బంధమును బలపరచి భవిష్యత్తులో నిర్మించుకునే గృహమునకు పునాదిని లోతుగా వేస్తాయి. నీవెంత వరకు సహించగలవో దేవునికి తెలుసు. ''నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కవగా ఆయన నిన్ను శోధింపబడనియ్యడు'' (1 కొరింథీ 10:13). తగిన సమయంలో ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోకి దిగ్విజయముగా మీరిద్దరు వెళ్ళే దారి ఆయనే సిద్ధం చేస్తాడు(నిర్గమ 14వ అధ్యాయం). కాబట్టి ఆయనను విశ్వసించు. నీ హృదయము నిరుత్సాహపడునట్లు అనుమతించవద్దు.
ప్రధానం - ఎంతకాలం
ప్రధానమైన తర్వాత ఎంతకాలం ఉండాలి? ఇంతకాలం అని చెప్పడానికి ఎటువంటి నియమములు లేవు కాని అమ్మాయి, అబ్బాయి ఒకచోట ఉండి తరచూ కలుసుకుంటున్నట్లయితే, ఆరునెలలు మించకుండా ఉండటం మంచిది. ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటే సాధారణంగా సంవత్సరం మించకూడదు. ఈ సమయంలో ఇద్దరి మనస్సులు గాలిలో తేలిపోతుంటాయి. కాబట్టి వారిని ఎక్కువ సమయం ఆవిధంగా ఉంచడం మంచిది కాదు. ఇది అనేక ఒత్తిడులకు దారితీస్తుంది.
''ఐ లవ్డ్ ఎ యంగ్ మాన్'' అనే పుస్తకంలో వాల్టర్ ట్రోబిస్క్ ప్రధానం అయిన కాలమును తల్లి గర్భములో ఉన్న శిశువుతో పోల్చాడు. వివాహ దినమును ఆ శిశువు జన్మ దినముతో పోల్చాడు. ఆ దినమునే అందరూ ఆ శిశువును చూడగలరు. కాని జన్మించుటకంటే ముందు గర్భములో కొన్ని నెలల సిద్ధపాటు ఉంటుంది. నిజముగా ప్రధానమైన తరువాత కాలం ఇలా ఉండాలి అని చెప్పుటకు ఇది ఎంతో అందమైన సాదృశ్యము.
ప్రధానం - ఒక గంభీర ఒడంబడిక
ప్రధానం అనేది ఒక వేడుకగా జరిగినా లేక సాధారణంగా జరిగినా అది వివాహమునకు ఒక ఒడంబడిక కాబట్టి దానిని తేలికగా తీసుకోకూడదు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పనివాడే దేవుని సన్నిధిలో నివసించు వాడని బైబిలు చెబుతుంది(కీర్తనలు 15:4). ''అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు'' (సామెతలు 12:22). ఒక క్రైస్తవుని మాట అవునంటే ''అవును'' కాదంటే కాదని ఉండాలి(మత్తయి 5:37; యాకోబు 5:12).
వివాహాన్ని గురించి ఏవైనా అనుమానాలొచ్చినప్పుడు అందుకు సంబంధించిన క్రొత్త విషయాలను తెలుసు కున్నప్పుడు ప్రధానం రద్దుచేసుకోవచ్చా? అవతలి వ్యక్తి తిరిగి జన్మించిన వ్యక్తి కానట్లయితే ప్రధానమును వెంటనే రద్దుచేసుకోవాలి. అవతలి వ్యక్తి తిరిగి జన్మించెనో లేదో ప్రధానమునకు ముందే చూసుకోవాలి. ఇలా చెయ్యడం పైన పేర్కొన్న పేరాలోని ఒడంబడికను అతిక్రమించినట్లు కాదు. ఎందుకంటే వివాహము నీ గురించి మాత్రమే చేసుకొనేది కాదు గాని ఈ భూమి మీద ప్రభువు యొక్క చిత్తమును నెరవేర్చుటకు చేసుకునేది. ఇక్కడ నీవు 2 కొరింథీ¸6:14 ను బట్టి నడువవలసియున్నది.
ఒకవేళ అవతలి వ్యక్తి తిరిగి జన్మించినవాడైనా, నీ విషయములో అపనమ్మకముగా ఉన్నట్లయితే లేక ఏదైనా ప్రాముఖ్యమైన విషయముల మీద తీవ్రమైన సిద్ధాంతపరమైన విబేధములు ఉన్నట్లయితే అప్పుడు ప్రధానమును రద్దుపరచుకోవచ్చు. ఒక వ్యక్తికి మాట ఇచ్చి తరువాత ఇది దేవుని చిత్తము కాదని మాట మార్చే చపలచిత్తులైన విశ్వాసులను దేవుడు ఘనపరచడు. తను విదేశాలకు వెళ్ళాలనే కారణముతో ప్రధానమును రద్దుచేసుకున్న ఒక యౌవనస్తుడు నాకు తెలుసు. ఆవిధముగా ఆ అమ్మాయి ఎంతో కష్టపడవలసి వచ్చింది మరియు ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయుటకు ఎంతో కష్టపడ్డారు. ఇలాంటివి స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా చేస్తారు. ఇటువంటి అస్థిరులైన వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు అవమానమును తీసుకువస్తారు. మాట ఇచ్చే ముందు ఒక వ్యక్తి నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఖచ్చితంగా లేనట్లయితే వేచియుండటం మంచిది. మన చంచల మనస్సు ద్వారా ఇతరుల జీవితములను పాడు చేయకూడదు. నీవు మ్రొక్కుకొనిన(ఇచ్చిన మాటను) దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు(ప్రసంగి 5:5).
సలహా కోరడం
పెళ్ళి చేసుకునే వారు పెళ్ళయిన విశ్వాసి దగ్గరకెళ్ళి సలహా కోరడం మంచిది. అలా సలహా ఇచ్చే వ్యక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. ఆడవాళ్ళు ఆడవాళ్ళ దగ్గరకి, మగవాళ్ళు మగవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వివాహ జీవితం గురించి వాళ్ళు ఇచ్చే సలహా విలువైంది.
లైంగిక విద్యను గురించి, శరీరతత్వమును గురించిన నియమములను తెలుసుకోవడం మంచిది. పురుషులైతే వివాహితుడైన వైద్యుని దగ్గరకు, స్త్రీలైతే వివాహితురాలైన వైద్యురాలిని సంప్రదించాలి. వైద్యులు విశ్వాసులైతే మరీ మంచిది. లైంగిక సంబంధమైన విషయాలు తెలియకపోవడం వలన సుఖమయ జీవితమును అనుభవించలేక బాధపడేవారున్నారు. లైంగిక సంబంధమైన విషయములను గురించిన సమాచారము ఈ దినములలో అనేక మంచి క్రైస్తవ పుస్తకములలో లభిస్తుంది.
వివాహ ఏర్పాట్లు
భాగస్వాములిద్దరు కలసి వారి వివాహ ఏర్పాట్లను గురించి చర్చించుకోవాలి. ఆ తరువాత వారు వారి తల్లిదండ్రులకు మరియు సంఘకాపరికి వారి వివాహము ఎలా జరగాలో తెలియజేయాలి. ప్రతి విశ్వాసి కూడా వారి వివాహములో అన్యుల ఆచారములు, సంప్రదాయములు లేకుండా సాధారణముగా మరియు క్రీస్తును ఘనపరచే విధముగా వారి వివాహము జరిగేటట్లు చూసుకోవాలి. అయ్యో! ఈనాడు భారతదేశములోని అనేక వివాహములలోనికి క్రైస్తవేతర మతములలో నుండి వచ్చిన సంప్రదాయములు వస్తున్నాయి. విశ్వాసులు కూడా అటువంటి సంప్రదాయములకు విధేయత చూపించడం సిగ్గుచేటు. దీనికి వారిని వారు సమర్ధించుకుంటూ మా తల్ల్లిదండ్రులను, బంధువులను అభ్యంతరపెట్టకుండుటకు అని చెప్తారు. దేవుడు దు:ఖపడినా, అవమానపరచబడినా మరియు అభ్యంతరపడినా వారికి పట్టింపు ఉండదు. వారు దేవునికి భయపడుట కంటే వారి బంధువులకే ఎక్కువ భయపడతారు. కనుక వారు ''సృష్టికర్త కంటే ఎక్కువగా సృష్టినే పూజించిరి'' (రోమా 1:25). అన్యాచారాలకు ద్వారాలు తెరచి వివాహంలో వాటికి చోటిస్తే ఆ వివాహంలో దేవుడున్నాడని అనుకోవడం భ్రమే అవుతుంది. దేవుని వాక్యమును పాటిస్తూ, ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు.
పెండ్లి కుమారునికి మరియు పెండ్లి కుమార్తెకు క్రీస్తునందున్న తమ విశ్వాసమును గురించి సాక్ష్యమిచ్చుటకు వివాహం అనేది ఒక మంచి అవకాశమును ఇస్తుంది. ఈ అవకాశమును వదులు కోకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఇదంతా కూడ తల్లిదండ్రులతో మరియు సంఘకాపరితో ముందుగానే చర్చించి దాని ప్రకారం వివాహమునకు ప్రణాళిక వేసుకోవాలి.
వివాహమైన తరువాత
పెళ్ళయిన వెంటనే లేదా సాధ్యమైనంత త్వరలో కనీసం ఒక వారం రోజులపాటయినా ఇద్దరూ ఒకరితో ఒకరు మరియు ప్రభువుతో గడపడం గురించి ఏదైనా ఏకాంత ప్రదేశమునకు వెళ్ళుట మంచిది. దీనిని హనీమూన్ అని పిలిచినా, పిలువకపోయినా ఈ సమయం ఎంతో అమూల్యం. ఒకవేళ నీ విషయంలో ఇది అసాధ్యమనిపించినట్లయితే దీని గురించి ప్రార్ధన చేసి చూడు. దేవుడు ఈ విషయంలో నీ గురించి చేసిన దానిని చూసి ఆశ్చర్యపడతావు.
వివాహమైన తరువాత, ఒక చిన్న గుడిసైనా సరే వారి స్వంత గృహములో నివసించుట మంచిది. బంధువులతో కలసి జీవించుట అనేక సమస్యలకు మరియు ఒత్తిడులకు దారితీస్తుంది. భారతదేశంలో, ఆర్ధిక పరిస్థితులను బట్టి కొంతమంది వారి తల్లిదండ్రుల దగ్గరే కలసి ఉండవలసి వస్తుంది. అటువంటి వారు ఎంతో తీవ్రముగా ఈ విషయమును గూర్చి ప్రార్ధన చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబము కూడా ప్రత్యేకముగా(వేరుగా) ఉండుట దేవుని చిత్తమైయున్నది. వీలైనంత త్వరగా వారు తమ స్వంత గృహమును ఏర్పరచుకొనునట్లు ప్రభువును నమ్మాలి.
వివాహ ఏర్పాట్లను గురించి పరిగణలోనికి తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయములను గురించి మనము పైన చూశాము. వీటిలో దేనిని కూడా తేలికగా తీసుకోకూడదు. అంతరిక్షములోకి రాకెట్‌ను పంపక ముందు చేసుకొన్న ఏర్పాట్లను బట్టే ఆ రాకెట్ విజయవంతమౌతుంది. అదేవిధంగా సంతోషకరమైన వివాహ జీవితమునకు పునాది వివాహ దినమునకు ఎంతో ముందే వేయబడుతుంది.
0 Comments