యవ్వనస్థులకు SEXUAL LIFE...HOW TO HANDLE IT

స్వభావసిద్ధంగా సంక్రమించిన లక్షణాలలో శక్తివంతమైనది కామం. అది ఒక ప్రేలుడు పదార్ధంలాంటిది! దేవుడిచ్చిన ఈ వరములో ఎంత ఆశీర్వాదమున్నదో గదా! అయినప్పటికీ దీనిని దుర్వినియోగపరచుట ద్వారా ఎంతో వినాశనము కలుగుతుంది.

ప్రతి స్త్రీ, పురుషులలో కూడా ఈ కామ వాంఛ మరియు కోర్కెలు ఉంటాయి. అందరిలో ఈ కోర్కెలు ఒకే విధముగా ఉండకపోయినప్పటికీ, యౌవన దశ నుండి కనీసం 30 సంవత్సరాలు ఈ కోర్కెలు ఒక శక్తిగా రూపొందుతాయి. ఒక ప్రేలుడు పదార్ధం వలె కామమును మంచి కొరకు ఉపయోగించవచ్చు, చెడు కొరకు కూడా ఉపయోగించవచ్చు. దేవుని మహిమ కొరకు ఉపయోగించవచ్చు లేక అపవాదిని సేవించుటకొరకై ఉపయోగించవచ్చు. పేలుడు పదార్ధములో పాపము లేదు కాని, దానిని మనము ఏవిధముగా మరియు దేని కొరకు ఉపయోగిస్తున్నాము అనే విషయాన్ని బట్టి ఉంటుంది. కామం విషయములో కూడా అంతే. దీనిని దేవుని యొక్క వరముగా అంగీకరించి, దేవుని యొక్క నియంత్రణలో జ్ఞానయుక్తముగా ఉపయోగించి నట్లయితే, ఇది మానివుని యొక్క అత్యున్నతమైన సఫలతకు సాధనముగా ఉంటుంది. ఒక వేళ దీనిని దుర్వినియోగపరచినట్లయితే అతడిని భ్రష్టత్వము యొక్క అత్యంత లోతులలోనికి నడిపిస్తుంది. ఒక వ్యక్తి చెప్పినట్లుగా, ఇది ఖచ్చితముగా ''అద్భుతమైన సేవకుడే గాని భయంకరమైన యజమాని''.

ఆహారము కొరకు మరియు విశ్రాంతి కొరకు కోరికలు కలిగియుండటము ఎంత సాధారణమో, లైంగిక సంబంధమైన కోరికలు కలిగియుండుట కూడా అంతే. కాని ఈ కోర్కెలను సృష్టించిన దేవుడే వాటిని సక్రమమైన పద్ధతిలో అనుభవించడానికి మార్గమును కూడా ఏర్పాటు చేశాడు.

విపరీత ధోరణులు

కామం దేవుని చేత సృష్టించబడినది, అది పరిశుద్ధమైనది మరియు పవిత్రమైనది. మానవుడు పాపములో పడిపోక మునుపే ఇది సృష్టించబడినది మరియు దేవుడు తానే ''చాలా మంచిది'' అని చెప్పిన లోకములో ఇది ఉన్నది. ఈ సత్యములను బట్టి ఇది స్పష్టముగా ఋజువగుచున్నది కాని మానవుడు పడిపోయినప్పటి నుండి, కామం పట్ల అతని వైఖరి చెడిపోయింది మరియు లైంగిక సంబంధమైన కోర్కెలకు తాను బానిసయ్యాడు. ఆదాము, హవ్వలు పాపము చేసిన వెంటనే వారు లైంగిక స్పృహను పొందారు మరియు వారి దిగంబరత్వాన్ని బట్టి సిగ్గుపడి వెంటనే వారి శరీరములను కప్పుకొనుటకు ప్రయత్నించారు. ఆ పతనము యొక్క విచార ఫలితాలను కోసుకుంటున్న లోకములో మనము జీవిస్తున్నాము. దాని ఫలితముగా, మానవునికి ఆశీర్వాదముగా ఉండవలసిన కామం భారముగా మారింది.

దేవుడిచ్చిన ''కామం'' అనే వరమును మానవుడు పదేపదే దుర్వినియోగపరచుట ద్వారా ''కామం'' అనే పదమే అనేకుల మనస్సులలో అపవిత్రమైన భావమును కలుగజేస్తుంది. దేవుడు పవిత్రముగా, సౌందర్యముగా మరియు పరిశుద్ధముగా ఉండాలని ఉద్దేశించిన దీనిని సినిమాలు, వ్యాపార ప్రకటనలు మరియు పుస్తకాలలోని బూతు సాహిత్యములు ఈనాడు కామమును గురించిన చెడిపోయిన మరియు వక్రమైన భావములు కలిగియుండుటకు దోహదపడుతున్నాయి.

కామమునకు సంబంధించి మన తలంపులు పెడమార్గము పట్టాయనడానికి అనేక ఋజువులున్నాయి.''క్రైస్తవ ప్రవర్తన'' అనే పుస్తకంలో సి.యస్‌.లూయిస్‌ అనే రచయిత ఇలా వ్రాస్తున్నారు - అమ్మాయిలు తమ ఒంటిమీద ఉండే వస్త్రములను ఊడదీసే దృశ్యం ఉన్న నాటకానికి ఎక్కువమంది ప్రేక్షకులను రాబట్టవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని చూడడానికి ఎగబడే ప్రజలున్న ఒక దేశానికి నీవు వెళ్ళావనుకో, అక్కడ రంగస్థలంపై మూతపెట్టిన పళ్ళెమును ప్రతిరోజు ప్రదర్శిస్తున్నారనుకో, దాన్ని చూడ్డానికి ప్రజలు వేలం వెర్రిగా వస్తున్నారు. లైటు ఆపివేయక ముందు ఆ ప్రదర్శకుడు ఆ పళ్ళెంమీదనున్న మూత నెమ్మదిగా తీస్తున్నాడు. అందులో ఏముందా? అని ప్రేక్షకులు ఎంతో ఆతురతతో చూస్తున్నారు. చివరకు ఆ పళ్ళెంలో వారెప్పుడూ తినే మాంసాహారం మాత్రమే ఉంది. దాన్ని చూచి ఆనందముతో వారు వెళ్ళి మరలా తరువాత రోజు ఆ ప్రదర్శనకు తిరిగి వచ్చినట్లయితే వారినేమనాలి? బహుశా వారి అభిరుచుల్లో ఏదో లోపం ఉందని అనుకోవాలి గదా? అదేవిధంగా వేరే లోకంలో(వాతావరణంలో) పెరిగినవారు కూడా మనలో ఉన్న కామపూరిత ధోరణులను గురించి ఇదేవిధముగా అనుకుంటారు.

చెడిపోయిన ఈ లోకములో దేవుని కొరకు వెలుగువలె ప్రకాశించడానికి క్రైస్తవుడు పిలువబడ్డాడు. కనుక కామం అంటే కేవలం ఒక భౌతిక ప్రక్రియగా మరియు సుఖానికి మూలముగా భావించే ఈ లోకము యొక్క దిగజారిన అభిప్రాయములకు అతడు వ్యతిరేకముగా నిలబడాలి. కామమును దేవుడు ఏవిధముగా చూస్తున్నాడో అదేవిధముగా తాను కూడా చూడగలుగునట్లు దేవుడు తన మనస్సును రూపాంతరపరచునట్లుగా దేవుని ఆత్మను అనుమతించాలి. కామం అంటే పాపపూరితమైనది కాదు, దాని గురించి సిగ్గుపడనక్కరలేదు. దేవుడు సౌందర్యముగా సృష్టించిన ఒక పవిత్రమైన విషయముగా దీనిని చూడగలగాలి.

చాలామంది మతైకవాదులకు, తాత్వికులకు కామం పట్ల ఒకరకమైన దురభిప్రాయాలున్నాయి. అసలు ఈ మానవ శరీరమే ఒక పాపభూయిష్టమైనది కాబట్టి దీన్ని ఎంత త్వరగా త్యజిస్తే అంత మంచిది అనుకునేవాళ్ళు కొందరైతే, మరికొందరు మరొక విపరీత ధోరణికి వెళ్ళి శరీరాన్ని పూజిస్తూ శారీరక కోరికలన్నీ ఏ అనుమానం లేకుండా తీర్చుకోవాలి అని – వాదించే వాళ్ళున్నారు.

క్రైస్తవ దృక్పథం ఏమిటంటే, ఆత్మ మరియు ప్రాణమువలె శరీరము కూడా దేవుని సృష్టిలోని భాగమే. కావున శరీరమునకు కూడా దేవుని ప్రణాళికలో నిర్ధిష్టమైన ఉద్దేశ్యమున్నది. తన దేహము పరిశుద్ధాత్మకు ఆలయం కాబట్టి క్రైస్తవుడు తన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని బైబిలు బోధిస్తున్నది (1 కొరింథీ 6:13-20). మన శరీరములను సజీవయాగముగా సమర్పించి దేవుణ్ణి ఆరాధించాలని మనము హెచ్చరించబడ్డాము (రోమా 12:1).

మానవ శరీరమే పాపమునకు హేతువు అని భావించే వారికి మార్టిన్‌ లూథర్‌ ఈ విధముగా చెప్పాడు - యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీరమును కలిగియున్నాడు అయినా కూడా ఆయన పాపము లేకుండా ఉన్నాడు. కాని అపవాదికి శరీరము లేకున్నా కూడా పాపముతో నిండియున్నాడు. పాపము యొక్క మూలము మానవ శరీరములో కాదు గాని మానవ హృదయములో ఉంటుంది. మానవ శరీరమును లేక దాని కోరికలను నిర్మూలము చేయుట ద్వారా కాదు గాని హృదయము మారుట ద్వారా పాపము నుండి విడుదల కలుగుతుంది. కొందరు ప్రార్ధించినట్లుగా, మన లైంగిక సంబంధమైన కోర్కెలను తీసివేయమని మనము ప్రార్ధించవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా చేస్తే మన పురుషత్వాన్నే కించపరచి, దేవుని యొక్క ఆలయమును కొంతవరకు పాడుచేసినట్లవుతుంది. మనము జయజీవితములో జీవించే పరిపూర్ణ పురుషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిప్పు అది ఉండే స్థానములో ఉన్నట్లయితే దానిని ఆర్పివేయాల్సిన పని లేదు. అయితే ఆ నిప్పు వల్ల ఇల్లు కాలిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.

ఏదేను వనములో ఆదాము శోధించబడుటకు దేవుడు ఎందుకు అనుమతించాడో, లైంగిక సంబంధమైన విషయాలలో మనము కూడా శోధించబడుటకు దేవుడు అందుకే అనుమతిస్తాడు. ఆదాము అమాయకునిగా ఉన్నాడు కాని అతడు పరిశుద్ధునిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నైతికముగా ఆదాము ఎంపిక చేసుకొని శోధనను జయించినప్పుడు మాత్రమే అతడు పరిశుద్ధునిగా అవ్వగలడు. మన విషయములో కూడా ఇదేవిధముగా     ఉంటుంది.

అపవిత్రమైన ఆలోచనలు

ప్రతి యౌవనస్తుడు కూడా ఎప్పుడో ఒకసారి అపవిత్రమైన ఆలోచనల చేత శోధించబడతాడు. స్త్రీలకంటే పురుషులలో ఈ కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి కనుక స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు.

మనుష్యుల హృదయములో నుండి వచ్చే వాటిలో చెడ్డ తలంపులు మొదటివని యేసుప్రభువు మార్కు 7:21 లో ప్రస్తావించారు. మార్పు చెందని వారు కూడా ఇదేవిధముగా దుష్టులుగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభువు వివరించినది మనందరి విషయములో సత్యమే. ఈ అపవిత్రమైన తలంపులు ఒక వ్యభిచారి మనస్సును ఏవిధముగా వేధిస్తాయో, నైతికముగా నిజాయితీ గల వ్యక్తిని కూడా అదేవిధముగా వేధిస్తాయి. అవకాశము లేక మరియు సామాజిక భయము ఈ నైతిక వ్యక్తిని శరీరములో వ్యభిచారము చేయకుండునట్లు అడ్డుపడుతుంది.

శోధనకు మరియు పాపమునకు ఉన్న వ్యత్యాసమును మనము తెలుసుకోవాలి. ''యేసు ప్రభువు కూడా అన్ని విషయములలో మనవలె శోధించబడ్డాడు''(హెబ్రీ 4:15). కాని ఆయన ఒక్కసారి కూడా శోధనకు లోబడలేదు(తన మనస్సులో కూడా). కాబట్టి ఆయన ఒక్కసారి కూడా పాపము చేయలేదు. ఈ భూమి మీద మన చివరి రోజు వరకు మనము కూడా శోదించబడుతూనే ఉంటాము. కాని మనము పాపము చేయవలసిన అవసరము లేదు. మన మనస్సులో దురాశను గర్భము ధరించినప్పుడే మనము పాపము చేస్తాము(యాకోబు 1:15). మన మనస్సులో కలిగే దురాశకు సంబంధించిన తలంపులను మనము అనుమతించినప్పుడు ఈవిధముగా జరుగుతుంది. మనము మొదటిసారే దానిని నిరాకరించినప్పుడు మనము పాపము చేయము. ఒక పాతకాలపు ప్యూరిటన్‌ బోధకుడు ఈవిధముగా చెప్పాడు - ''నా తలమీద పక్షులు ఎగురకుండా నేను అడ్డుకోలేను గాని, నా తలమీద గూడు కట్టుకోకుండా అడ్డుకోగలను''. ఒక చెడ్డ తలంపు మన మనస్సులోకి వచ్చినప్పుడు, దానిని గురించి ఒక్క క్షణమైనా మనము ఆలోచించినట్లయితే అది మన మనస్సులలో గూడు కట్టుకొనునట్లు మనము అనుమతిస్తాము, తద్వారా పాపము చేస్తాము.

ఒక్కసారి మోహపు ఆలోచనలలో పడిపోయినట్లయితే అది ఆ వ్యక్తిని ఇంకా ఎక్కువగా బానిసగా చేసుకుంటుంది. సమయము గడిచేకొలదీ విడుదల కష్టమవుతూ ఉంటుంది. మనమెంత విడుదల కోసము చూస్తామో అంత సులభముగా విడుదల పొందవచ్చు. చెడు తలంపుల మీద విజయము(ఇతర పాపము మీద విజయము వలె), మన ఓటమిని యదార్ధముగా ఒప్పుకొనుట ద్వారా, విడుదల కొరకు ఆకలిదప్పులు కలిగియుండుట ద్వారా, క్రీస్తుతో మన మరణమును అంగీకరించుట ద్వారా, ప్రభువుకు మన శరీరములను, మనస్సులను సంపూర్ణముగా అప్పగించుకొనుట ద్వారా వస్తుంది (రోమా 6:1-14).

మనము నిరంతర జయమును అనుభవించాలంటే, మనము ''ఆత్మలో నడుచుకుంటూ'' మనలను మనము క్రమశిక్షణలో ఉంచుకుంటూ ఆయనతో ఏకీభవించాలి(గలతీ 5:16-18). మన కన్నులను మరియు చెవులను క్రమశిక్షణలో పెట్టుకునే విషయంలో(కామమునకు సంబంధించిన వాటిని చదవడం గాని, చూడటం గాని, వినడం గాని చేయకూడదు) మనము తప్పిపోయినట్లయితే మన తలంపులను కూడా మనము క్రమశిక్షణలో పెట్టుకోలేము ( మత్తయి 5:28-30 వచనముల నిజమైన అన్వయింపు అదే). మోహపు తలంపుల నుండి విడుదల పొందుటకు శరీరము యొక్క క్రమశిక్షణ అవసరమైయున్నది. వారి మనస్సులలో లైంగిక సంబంధమైన శోధనలతో ఎల్లప్పుడూ యుద్ధం చేయవలసి వచ్చేదని గొప్ప పరిశుద్ధులు కూడా ఒప్పుకున్నారు. జయం పొందుటకు వారి శరీరములను ఎంతో తీవ్రంగా క్రమశిక్షణలో పెట్టుకోవలసి వచ్చింది.

యోబు వివాహితుడై పదిమంది పిల్లలను కలిగియున్నా కూడా తాను మోహపు తలంపుల నుండి విడుదల పొందాలంటే తన కన్నులను క్రమశిక్షణలో ఉంచుకోవాలని గుర్తించాడు. ''కన్యకను మోహపు చూపుతో చూడకుండా నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని'' (యోబు 31:1- ద లివింగ్‌ బైబిలు తర్జుమా). పురుషులకు, గొప్ప శోధనలు కన్నుల ద్వారా కలుగుతాయి. ఇక్కడ మనము జాగ్రత్తగా ఉండకుండా ఒక అపవిత్రమైన తలంపును గాని లేక ఒక బొమ్మను గాని మన కంటి ద్వారము ద్వారా మన మనస్సులోనికి అనుమతించినట్లయితే, అక్కడ నుండి దానిని తొలగించడం దాదాపు అసాధ్యము.

మనము ఉదయమున లేచిన వెంటనే మరియు రాత్రి నిద్రపోయే ముందు కూడా దేవునితో సమయము గడుపుట కూడా ఈ క్రమశిక్షణలోని భాగమే. మనము ఉదయమున నిద్ర లేచి అదేపనిగా పడక మీద అటుఇటు దొర్లుతున్నట్లయితే మన మనస్సులోనికి చెడుతలంపుల ప్రవాహమునకు ద్వారము తెరచినట్లే. అనుదినము కూడా దేవుని వాక్యముతో నింపబడునట్లుగా మన మనస్సులను తెరవాలి - చెడుతలంపులకు భద్రత, దేవుని వాక్యమును మనస్సులలో నింపుకోవడమే. ''నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొనియున్నాను'' (కీర్తనలు 119:11).

''మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతయైనను, మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి'' (ఫిలిప్పీ 4:8). భారతదేశమునకు వచ్చిన గొప్ప మిషనరీ హెన్రీ మార్టిన్‌ తన పుస్తకంలో ఈవిధముగా వ్రాశాడు - ''అపవిత్రమైన తలంపులతో పోరాడేటప్పుడు లేఖనముల ఆజ్ఞకు విధేయత చూపించుట ద్వారా నేను గొప్ప సహాయం పొందాను''.

ఎప్పుడైతే ఒక అమ్మాయి యెడల మోహపు తలంపు వస్తుందో వెంటనే అతడు ఈవిధంగా ప్రార్ధించేవాడు. ఆమె తన హృదయములో, మనస్సులో పవిత్రపరచబడి తన దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంటూ దేవుని మహిమ కొరకు ఆమె ప్రతిష్టించుకోవాలని కోరుకునేవాడు. ఈవిధంగా ప్రార్ధించిన తరువాత అతడు ఆ అమ్మాయిని గురించిన తలంపులలో కొనసాగుటకు ధైర్యం చేసేవాడు కాదు. పవిత్రమైన తలంపులు కలిగియుండుటకు ఇది ఎంతో గొప్ప పద్ధతిగానున్నది.

మనచుట్టూ నైతిక విలువలు ఎంతో తక్కువ ప్రమాణములలో ఉన్న ఈ ప్రపంచంలో అపవిత్రమైన తలంపుల నుండి పూర్తిగా విడుదల పొందడం ఎంతో కష్టమని కొందరంటుంటారు. కాని ఇటువంటి పరిస్థితులు కేవలం 20వ శతాబ్ధంలోనే ప్రత్యేకమైనవి కావు. మొదటి శతాబ్ధంలో కొరింథు పట్టణం కూడా జారత్వమునకు, కాముకత్వమునకు కేంద్రంగా ఉన్నది. అయినా కూడా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టవలెనని(2 కొరింథీ 10:5) దేవుని యొక్క ఆత్మ క్రైస్తవులను బ్రతిమిలాడాడు. ఈనాడు కూడా మనము అదేవిధముగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. జీవమునకు పోవు మార్గము ఇరుకైనది మరియు కష్టమైనదైనా కూడా ఆ మార్గములో మనము నడచుటకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు.

మన జీవితములను క్రమశిక్షణలో పెట్టుకొనుటంటే అమ్మాయిల మీద వ్యతిరేకమైన వైఖరిని పెట్టుకోమని కాదు. అవతలి వారు ఆర్షణీయంగా కనబడుతున్నట్లయితే, అందులో పాపమేమి లేదు. ఇది ఎంతో సహజం. దేవుని యొక్క సౌందర్యమైన సృష్టిలో ఒక అందమైన ముఖమును ప్రశంశించుటలో తప్పేమి లేదు. కాని పడిపోయిన జీవులముగా, మనము జాగ్రత్తగా ఉండనట్లయితే ఆ అందమును గమనిస్తూ తరువాత మోహిస్తాము. అవతలి వారిలో ఉన్న ఆకర్షణలో అపవిత్రత ఏమి లేకున్నా కూడా మనము అపవిత్రమైన తలంపులు కలిగియుండునట్లు చేయగలదు.

''ఎ సెకండ్‌ టచ్‌'' అనే పుస్తకములో కెయిత్‌ మిల్లర్‌ ఈవిధముగా చెప్తాడు. ఎంతో లోతుగా దేవునికి ప్రతిష్ఠించుకున్నా కూడా అవతలి వారి(శీజూజూశీరఱ్‌వరవఞ) లో ఉన్న సౌందర్యమును గమనించకుండా ఆ ప్రతిష్ఠత కాపాడలేదని నేను గమనించాను. ఈవిధముగా గుర్తించడం అనేది ఏవిధముగానైనను పాపమని లేక ఒకరు ఆత్మీయముగా పరీక్షించుకోవాలని నేను అనుకోను. నిజానికి, అవతలివారిలో(శీజూజూశీరఱ్‌వరవఞ) భౌతిక సౌందర్యమును నీవు గుర్తించినట్లయితే, ఒకవేళ నీవు నా వయసులో ఉన్నట్లయితే, బహుశా నీ ఆరోగ్యమును నీవు పరీక్షించుకోవాలి. మరియు నేను చాలా తీవ్రంగా చెబుతున్నాను. నా అభిప్రాయములో ''గుర్తించడం'' అనేది పాపము కాదు. క్రైస్తవ గుణలక్షణములను మెరుగుపరచుకొనుటకు పడిపోవుటకు(పాపము చేయుటకు) గల అవకాశములను తెలుసుకొనుట అనేది ముఖ్యము. ఉదాహరణకు, ఒక గ్రుడ్డివాని ముందు బల్లమీద బంగారం పెట్టినట్లయితే, అతడు దొంగిలించనంత మాత్రమున నిజాయితీపరుడని మనము చెప్పలేము. కాని ఎవరైతే ఆ బంగారమును చూస్తారో, దానిని తీసుకోవాలనే ఒత్తిడిని కలిగియుండి కూడా దానిని తీసుకోరో వారిని నిజాయితీ పరులుగా పరిగణించవచ్చు. సమస్యలను కొనితెస్తుందని గుర్తెరిగినవాడు ఈవిధంగా చేస్త్తాడు.

పరిశుద్ధాత్ముడు మనలను పరీక్షించి మన కన్నులను మరియు మన తలంపులను వేరే మార్గములోనికి త్రిప్పమని చెప్పినపుడు ఎప్పుడైతే మనము వెంటనే పరిశుద్ధాత్మ స్వరమునకు విధేయత చూపిస్తామో, అందులోనే మన భద్రత ఉంది.

''ప్రభువా నేను జయించలేని శోధనను(ఈ విషయంలో) ఎదుర్కొనకుండునట్లు సహాయం చేయండి'' అని మనము తరచుగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనను యదార్థంగా చేసిన అనేకమంది యౌవనస్తులు జయమును పొందారు.

హస్త ప్రయోగం

ఆలోచనలలో సరిగా ఉండనట్లయితే శరీరము యొక్క కోరికలలో క్రమశిక్షణ లేకుండా పడిపోతాము. ఒక క్రైస్తవుడు ఈవిధముగా చేయకూడదు. ''పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురిచూడని వానివలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను''(1 కొరింథీ 9:25-27) అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.

మీలో ప్రతివాడును దేవుని యెరుగని అన్యజనులవలె కామాభిలాషయందు గాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగి ఉండుటయే దేవుని చిత్తము(1 థెస్సలోనిక 4:4-5) అని మరలా పౌలు చెప్తున్నాడు.

''ద బైబిల్‌ అండ్‌ సెక్స్‌ ఎథిక్స్‌ టుడే'' అనే తన పుస్తకంలో సి.జి.స్కోరర్‌ ఈవిధంగా చెప్పారు. అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలలో నుండి బైబిల్లో నేరుగా ప్రస్తావించని మరొక విషయానికి సంబంధించి సలహాను తీసుకోవచ్చు. అదేమిటంటే రహస్యముగా, ఒంటరిగా స్వయంతృప్తి పొందడం లేక హస్తప్రయోగం. మనిషి యొక్క జీవితములోని రహస్య విషయముల గురించి వివరించడానికి క్రొత్త నిబంధన ప్రయత్నించలేదు. ఆధునిక మానసిక శాస్త్రము ఆవిధంగా చేయడానికి ప్రయత్నించవచ్చేమో; క్రీస్తు మరియు అపొస్తలులు ఆవిధంగా చేయలేదు. మన శరీరముల మీద దేవుని యొక్క అధికారమును ఈ స్వయం తృప్తి తిరుగుబాటు చేసే కోరికను పుట్టిస్తుంది. తన కోసమే శృంగారభరిత అనుభవమే పరమావధిగా ఇది చేస్తుంది. ఒక పురుషుడు గాని లేక స్త్రీ గాని తన స్వంత కోర్కెలను జయించే దానికి బదులుగా వాటికి బానిసలౌతారు. లైంగిక వాంఛలు ఆత్మీయశక్తికి విరోధముగా పనిచేస్తాయి.

 శరీరము యొక్క కోర్కెలు శరీరమును పరిపాలిస్తున్న ట్లయితేే, అప్పుడు ఆత్మ ఏమి చేయలేదు. మానసికంగా వీటిని గుణలక్షణాలలోని అపరిపక్వత, స్వయం కేంద్రీకృతం, స్వయం తృప్తిగా సూచిస్తుంటారు. వీటన్నింటిని జయించవలసియున్నది. ఇది జారత్వమంత తీవ్రమైనదిగా పరిగణించబడదు ఎందుకంటే ఇందులో ఇతరులెవరు ఉండరు. కాని హఠాత్తుగా వచ్చే అలాంటి ఉద్రేకమైన కోర్కెల వలన తన్నుతాను నిగ్రహించుకోలేకపోతున్నాననే భావన ఆ వ్యక్తికి వస్తుంది. అది తన్నుతాను తక్కువగా భావించుకొనేటట్లు చేస్తుంది. తన స్వీయ ఔన్నత్యం విషయంలో ఉన్న కలవరమును బట్టి క్రీస్తు కొరకైన తన సాక్ష్యమును కూడా అది శూన్యపరుస్తుంది. ఆరంభములోనే ఇటువంటి లైంగిక ఉద్రేకములను చిత్తముతో మరియు విజ్ఞముతో ఎదిరించిన యెడల పరిష్కారం దొరుకుతుంది.

హస్తప్రయోగం అనేది ఏ జబ్బుకు దారితీయకపోవచ్చు కాని ఇది నిరాశలోనికి మరియు మన దృఢచిత్తమును బలహీనపరచునట్లుగా చేస్తుంది. ఇదంతా కూడా ఒక వ్యక్తి దేవునితో సహవాసము చేయకుండా చేసి మరియు అతని ఆత్మీయ ప్రభావమును తగ్గిస్తుంది. ఒకవేళ దీనిలో ఎక్కువగా పడిపోతూ ఉన్నట్లయితే, వివాహం తరువాత లైంగిక సంబంధంలో కూడా సమస్యలను తెస్తుంది. దేవుని వరమైన శృంగారమును దుర్వినియోగపరుస్తుంది కాబట్టి హస్తప్రయోగము ఒక పాపము. దీని గురించి పశ్చాత్తాపపడాలి మరియు విడచిపెట్టాలి.

యౌవనస్తులు ఎక్కువగా శృంగారము గురించి వారి లోకసంబంధమైన స్నేహితుల యొద్ద నుండి చెడిపోయిన విధానములో నేర్చుకుంటారు గనుక ఈ చెడ్డ అలవాటు చేత పట్టబడతారు. ఒకసారి ఈ పాపమునకు లోనయినట్లయితే, ఒక వ్యక్తిని ఎంతో గట్టిగా పట్టుకొని పదే పదే దానిలో పడిపోయేటట్లు చేస్తుంది. అయితే క్రీస్తు అతనిని విడిపించగలడు.

ఒక కండరమును అనేక సంవత్సరములు ఉపయోగించనట్లయితే, అది ఏవిధముగా ఉపయోగపడకుండా పోతుందో, వారి మర్మాంగములను కూడా ఉపయోగించనట్లయితే పనికిరాకుండా పోతాయని, అందుకు హస్తప్రయోగం అవసరమని అనేకమంది స్నేహితులు యౌవనస్తులకు చెబుతూ ఉంటారు. ఇది ఎంతో తప్పుడు అభిప్రాయము. మర్మాంగములను ఉపయోగించనంత మాత్రమున అవి పనికిరావని లేక శక్తిని కోల్పోతాయని అనుకోవడం తప్పు, ఆవిధంగా జరగదని వైద్యనిపుణులు అంగీకరించారు. లైంగికసంబంధమైన కోర్కెలను అదుపులో ఉంచుకుంటే ఎటువంటి మానసికమైన హాని కూడా జరుగదు. నిజానికి లైంగిక సంబంధమైన కోరికలను అదుపులో ఉంచుకుంటే ఎటువంటి హాని కూడా జరుగదు. దానికి వ్యతిరేకముగా, ఆవిధముగా ఒక వ్యక్తి తనను క్రమశిక్షణలో పెట్టుకున్నట్లయితే, తన చిత్తము మరి యెక్కువ ధృడముగా మారి తన మనస్సు మరి యెక్కువ మెళకువగా ఉంటుంది. ఒక పురుషుడు తన మర్మాంగమును తన జీవితాంతము ఒక్కసారి కూడా ఉపయోగించకుండా ఉన్నా కూడా తన మనస్సులో, శరీరములో పరిపూర్ణమైన ఆరోగ్యమును కలిగియుండగలడు.

వారు నిద్రిస్తున్నప్పుడు జరిగే వీర్యస్ఖలనము గురించి కొంతమంది యౌవనస్తులు చింతిస్తుంటారు. ఇదంతా కూడా వారి శరీరములో జరిగే సహజ ప్రక్రియ మాత్రమే. శరీరంలో ఎక్కువగా ఉన్న పదార్ధములు బయటకు పంపించబడుతుంటాయి. వారు అసాధారణముగా ఉన్నవారు కాదు మరియు దానిని గురించి పట్టించుకోవలసిన పనిలేదు.

ప్రతి పురుషుడు కూడా తన లైంగిక కోర్కెలను వివాహానికి ముందే అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత ఈవిధంగా అదుపుచేసుకోవడం ఎంతో అవసరమవుతుంది. వివాహం తరువాత కూడా లైంగిక విషయాలలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అదుపులేని సంయోగమునకు వివాహం చేసుకొనుట అనేది అధికారపూర్వకముగా స్వేచ్ఛనిచ్చినట్లు కాదు. ఎవరైతే వివాహమునకు ముందు ఈవిషయములో క్రమశిక్షణ నేర్చుకోరో, వివాహం తరువాత తప్పకుండా నేర్చుకోవలసి వస్తుంది.

ఇప్పటికే ఈ చెడ్డ అలవాటులో పట్టబడినవారు దీని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటారు. దీని నుండి విడుదలకు మార్గమేమిటంటే క్రీస్తుతో తన మరణములోను మరియు పునరుత్థానములోను మన ఐక్యతను గుర్తించడమే. మరియు మనమీద పాపముకున్న పట్టు కూడా విరిగిపోయిందని గుర్తించడమే. పరిశుద్ధాత్మతో నింపబడుటకు మనలను మనము ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు జయము అనేది మన జీవితములలో నిజమౌతుంది(రోమా 8:2).

మన జీవితములలో అనుదినము తీరిక లేకుండ మనము ప్రణాళిక వేసుకోవాలి. మన మనస్సులు మరియు ప్రత్యేకముగా మన శరీరములు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమైయుండాలి. సోమరితనము గల మరియు వ్యాయామం చేయని శరీరములే లైంగిక కోరికలకు ఎరగా దొరుకుతాయి. ఎవరైతే కష్టపడి పనిచేసుకుంటూ జీవిస్తుంటారో అలాంటివారు ఈ విషయములో అంత సమస్యలను ఎదుర్కోరు. మనుష్యుడు కష్టపడి పనిచేయాలని దేవుడు నియమించాడు. ఆదాము తన ముఖపు చెమట కార్చి ఆహారమును సంపాదించు కోవలసియున్నది (ఆదికాండము 3:19). మనకు ఎంతో సమయమును మిగిల్చే సాధనములను విజ్ఞానశాస్త్రము కనుగొన్నది. కాబట్టి ఇప్పుడు ఆధునిక యౌవనస్తులు ఎక్కువ సమయము సోమరులుగా ఉండుటను బట్టి అపవాది వారిని ఎంతో త్వరగా వాడుకుంటున్నాడు. కాబట్టి మనము అటువంటి సమయమును మిగిల్చే పరికరములను వాడకూడదని నేను చెప్పట్లేదు. వాటిని ఉపయోగించండి. కానీ మన ఖాళీ సమయమును ఏదైనా క్రొత్తగా ఆలోచించుటకు లాభకరముగా వాడుకోవాలి.

శరీరంలో ఉన్న శక్తి నాలుగు విధాలుగా ఖర్చవుతుంది. శారీరక శ్రమలో, మానసిక పనిలో, ఉద్రేకపూరితమైన అనుభవములలో లేక లైంగిక సంయోగములో. ఒకవేళ మన శరీరములోని శక్తి మొదటి మూడు విధాలలో ఖర్చు కానట్లయితే నాలుగవ విధానంలో ఖర్చవడానికి ఒత్తిడి పెరుగుతుంది. కాని ఈవిధముగా లైంగిక సంబంధముగా శక్తి ఖర్చు అయ్యేటప్పుడు మిగిలిన విధానములలో కంటే ఎక్కువగా, భౌతికముగా శరీరములో మరియు నరముల యొక్క శక్తి హరించుకుపోతుంది.

కొంతమందికి మిగిలిన వారి వలె లైంగిక సంబంధమైన కోరికలు మరియు ఒత్తిడి అంతగా ఉండవు. లైంగిక సంబంధమైన కోరికలను ఎక్కువగా కలిగియుండి ఈ ఒత్తిడిని ఎవరైతే ఎక్కువగా కలిగియుంటారో వారు అసాధారణముగా భావించవలసిన అవసరం లేదు. వారిలో ఎంతో సృజనాత్మకత దాగి ఉందని, వారు ఇతర ప్రయోజనకరమైన మార్గములలో దానిని ఉపయోగించవచ్చని ఇది సూచిస్తుంది. మోహముతో ఎల్లప్పుడూ మనము పోరాడాలని  దేవుడు కోరట్లేదు. మన శరీరంలోని శక్తిని(లైంగిక సంబంధమైన ఆలోచనలు గాని మరియు ఆ కార్యములకు సంబంధించిన) దేవుణ్ణి మహిమ పరచే మరియు మన తోటి మనుష్యులకు సహాయపడే విధానములలో మళ్ళించాలని ఆయన కోరుకుంటున్నాడు.

తన శరీరము అనుదిన భౌతిక వ్యాయామములతో మరియు పనులతో ఉండునట్లు ప్రతి క్రైస్తవ యౌవనస్తుడు ఉంచుకోవాలి. తన ఖాళీ సమయమును సోమరిగా మాటలు చెప్పేదానికి బదులు బైబిలు అధ్యయనముతో మరియు ప్రార్ధనలతో గడపాలి(ఇది తన మనస్సుకు వ్యాయామం వలె ఉంటుంది). అప్పుడు దినము గడిచే సరికి తమ దేవుని కోసం ఎంతో సాధించడం మాత్రమే కాక ఎంతో అలసిపోయి పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. రాత్రి మోహపు తలంపులతో పీడించబడి, హస్త ప్రయోగము చేసుకొనుటకు శోధించబడే దానికి బదులు తాను ఆశీర్వాదకరమైన నిద్రలోనికి జారుకుంటాడు. ''కష్టపడి పనిచేసే వ్యక్తి బాగా నిద్రిస్తాడు'' అని బైబిలు చెప్తుంది(ప్రసంగి 5:12 ద లివింగ్‌ బైబిలు తర్జుమా).

తినుట మరియు నిద్రించుట అను సామాన్యమైన విషయాలలో క్రమశిక్షణను కలిగియున్నట్లయితే, లైంగిక సంబంధమైన కోర్కెలను అదుపులో పెట్టుకొనుట సులభమవుతుంది. వీటిలో క్రమశిక్షణను కలిగిలేని కారణమును బట్టి అనేకమంది లైంగిక సంబంధమైన విషయములలో ఓడిపోతున్నారు. అతిగా తినుటకు మరియు లైంగిక సంబంధమైన కోర్కెలు రేగుటకు మధ్య ఎంతో సంబంధం ఉంది. ''ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖ స్థితియు మరియు సోమరితనము'' (యెహెజ్కేలు 16:49) వలనే పురాతన సొదొమలో లైంగిక పాపములు పెరిగిపోవుటకు కారణములు. ఎవరైతే లైంగిక కోర్కెల ద్వారా జయించబడుచున్నారో వారు వారి ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ కలిగి మరియు ప్రభువు యొక్క ముఖమును ఎంతో ఆసక్తితో ఉపవాసములతోను మరియు ప్రార్ధనలతోను వెదకినట్లయితే అతి త్వరలోనే వారు విడుదలనొందుతారు.

ప్రభువు ఎల్లప్పుడు మనతోనే ఉన్నాడు మరియు మనలను చూస్తున్నాడు అనే విషయమును గమనమును కలిగి అన్నింటికంటే పైగా మనము ఎల్లప్పుడు ప్రభువు యొక్క సన్నిధిని కలిగియుండాలి. ఇతర విశ్వాసి చూస్తున్నట్లయితే మనము ఖచ్చితముగా హస్త ప్రయోగములో పడిపోము. మరి మనము దేవునికి ఇంకెంత భయపడాలో కదా!

ఒకవేళ నీవెంత ప్రయత్నించినా కూడా, ఏదైనా ఒక సమయములో ఈ శోధనను జయించలేనట్లయితే అప్పుడు వెంటనే ఇతరుల సహవాసమును కోరుకొనుట మంచిది(ఒక విశ్వాసి దగ్గరకు వెళ్ళుట మంచిది). ఇది నీవు జయించునట్లు నిన్ను బలపరుస్తుంది.

వ్యభిచారం

ఒక స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక సంయోగం ఇరువురిని ''ఒక్క శరీరము'' గా చేస్తుంది. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏక దేహమైయున్నాడని మీరెరుగరా? - వారిద్దరు ఏక శరీరమైయుందురు అని మోషె చెప్పుచున్నాడు గదా? (1 కొరింథీ 6:16). పాత నిబంధనలో స్త్రీ, పురుషుల మధ్య సంయోగం ''ఎరుగుట'' అని చెప్పబడింది. లైంగిక సంయోగం వలన కేవలం భౌతిక సంబంధమైన పరిణామాలు మాత్రమే ఉండవు. అది అంత సులభంగా మర్చిపోయేది కూడా కాదు. అది ఇద్దరు మనుష్యులను ''ఏక శరీరము''గా చేస్తుంది. అందుకే అక్రమమైన లైంగిక సంయోగమునకు దేవుడు ఆటంకములను ఉంచాడు. అవేమిటంటే మరణకరమైన వ్యాధులగు ఎయిడ్స్‌(ూIణూ), సిఫిలిస్‌(ూవజూష్ట్రఱశ్రీఱర) మొ||నవి. ''వేశ్యాసంగులకును, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును'' (హెబ్రీ 13:4) అని బైబిలు చెప్తుంది.

యౌవనస్తులు సాధారణంగా బాధ్యతలు లేకుండా సంతోషం కోసం, అనందం కోసం చూస్తుంటారు. ఇందువలనే వివాహ జీవితములోని బాధ్యతల కోసం చూడకుండా లైంగిక సంబంధమైన ఆనందం కోసం వారు శోధించబడుతుంటారు. ఎవరైతే స్త్రీలను ఆవిధంగా తక్కువ చేస్తారో వారి జీవితములలోనికి దేవుని తీర్పు తప్ప మరేదియు రాదు.

యౌవనస్తులు తమ పురుషత్వమును ఋజువుపరచుకోవాలని కొన్నిసార్లు తమ చెడిపోయిన స్నేహితుల ద్వారా సవాలు చేయబడుతుంటారు. ఒక అమ్మాయితో కలసి ఉండకపోయినా లేక లైంగికముగా ఏమైనా సాహసం చేయకపోయినా వారు వెక్కిరించబడుతుంటారు. నిజమైన పురుషత్వం అనేది లైంగిక ధృవీకరణలో కాదు గాని కోర్కెలను నిగ్రహించుకోవడంలోనే ఉంటుంది.

దురాశలను అదుపుచేసుకోలేక పాక్షికంగా ''తప్పిపోయిన'' దావీదు యొక్క ఉదాహరణను బైబిలు మనకిస్తుంది. అతడు పడిపోవుటకు నడిపించిన పరిస్థితులను గమనించండి. 2సమూయేలు 11:1,2 వచనములు మనకు ఏమి చెబుతున్నాయంటే అతడు యుద్ధరంగములో ఉండవలసియుండగా సోమరిగా ఇంట్లోనే ఉన్నాడు. అతడు తన పనిని మరచిపోయి సోమరితనమునకు మరియు సౌఖ్యమునకు తావిచ్చాడు. అప్పుడు అతడు బత్షెబను చూశాడు. తన కన్నులను క్రమశిక్షణలో పెట్టుకోకుండా ఆమెనే చూస్తూ ఉన్న కారణమును బట్టి పాపములో పడిపోయాడు.

అదుపు లేని తన దురాశల వలన సంసోను కూడా పూర్తిగా ''తప్పిపోయాడని'' మనము బైబిలులో చదువుతాము(న్యాయాధిపతులు 14 మరియు 16 అధ్యాయములు). అతడు ఒక అందమైన అమ్మాయిని చూసినపుడు ఒక దైవ సేవకునిగా తన పిలుపును మరచిపోయాడు. ఆవిధంగా తన పరిచర్యను కోల్పోయాడు. అనేకమంది ఈవిధముగా పడిపోయి తమ పరిచర్యలను కోల్పోయారు.

మరొక ప్రక్క మనము చూసినట్లయితే యోసేపుకు దావీదువలె సుఖసౌఖ్యములు మరియు గొప్ప స్థానము లేదు. సంసోను కలిగియున్నట్లుగా దేవుని సేవించుటకు యోసేపుకు గొప్ప పిలుపు కూడా లేదు. అయినా కూడా ఈ మోహం విషయంలో అతడు పూర్తిగా జయించాడు. ఆదికాండము 39వ అధ్యాయమును ప్రతి ఒక్క యౌవనస్తుడు కూడా చదవాలి మరియు అధ్యయనం చేయాలి. యోసేపుకు శోధన ఎటువంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా ఒక దినమున ఎలా వచ్చిందో 7వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మనకు కూడా అదేవిధంగా వస్తుంది. మనం ముందే సిద్ధపడనట్లయితే తప్పకుండా దానిలో మనం పడిపోతాం. ఒకవేళ యోసేపు రహస్యముగా మోహపు తలంపులను కలిగియున్నట్లయితే సులభముగా పడిపోయుండేవాడు. కాని యోసేపు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. అతడు దేవుని యొద్ద నుండి కలలను కలిగియున్నాడు. కనుక ఒక శోధన వచ్చినప్పుడు, మరెవరి సన్నిధి కంటె కూడా ఎక్కువగా దేవుని సన్నిధి అతనికి ఎంతో వాస్తవికముగా ఉండేది. ఒకవేళ యోసేపు యొక్క ఆత్మీయత నిజముగా లోతుగా లేకుండా కేవలం ఇతరుల మెప్పును మాత్రమే కోరుకొనేదైతే, అప్పుడు అతడు ఖచ్చితముగా ఆ బలమైన శోధనలో పడిపోయుండేవాడు.

ఇక్కడ మనం గమనించినట్లయితే, యోసేపును ఆ పాపములో పడకుండా చేసింది దేవుని యందలి భయమే గాని పట్టబడతానేమోనని లేక దేవుని చేత శిక్షించబడతానని కాదు(9వ వచనం). అయ్యో! కేవలం పైన చెప్పబడిన చివరి రెండు భయములే అనేకమందిని పాపము చేయకుండా కాపాడుతున్నాయి. కాని యోసేపుకు దేవునితో ఉన్న సంబంధం ఈనాడు అనేకమంది దేవునితో కలిగియున్న పైపై సంబంధము కంటే ఎంతో లోతైనది.

పోతీఫరు భార్య మరలా, మరలా యోసేపును పాపము చేయుటకు శోధించినా కూడా యోసేపు నిరోధించాడని మనము చదువుతాము(10వ వచనం). అతడు మొదటిసారి ''కాదు'' అని చెప్పాడు. అది రెండవసారి ''కాదు'' అని చెప్పుటకు సులభమైంది. మరియు మూడవసారి కూడా ''కాదు'' అని చెప్పుటకు సులభమైంది. ఒక కీర్తనలో చెప్పబడినట్లుగా ''శోధనకు అప్పగించుకొనవద్దు, అప్పగించుకొనుటే పాపము; ప్రతి విజయము కూడా మరొక విజయమునకు సహాయం చేస్తుంది''.

పోతీఫరు భార్య యొక్క సమక్షములో ఉండకుండా యోసేపు తొలగిపోయెనని ఆదికాండము 39:10 మనకు చెబుతుంది. వీలైనంత వరకు శోధించబడే ప్రదేశము నుండి వెళ్ళిపోవుట ఎల్లప్పుడు కూడా భద్రతయైయున్నది.

అవతలివారితో మన సంబంధముల విషయములలో ఎంతో జాగ్రత్తగా ఉండవలెనని యోసేపు యొక్క ఉదాహరణ మనలను హెచ్చరిస్తుంది. అందమైన మరియు ఆకర్షణీయమైన అమ్మాయిలు ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండటం కాదు గాని ఆకర్షణీయముగా లేని అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అందంగా లేని అమ్మాయిలు వారు అందంగా లేరని పురుషులు తమ శరీరములను తాకునట్లు వారు స్వేచ్ఛనిస్తారు. ''జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి'' (1 కొరింథీ 6:18-20) అని బైబిలు మనలను హెచ్చరిస్తున్నది. ''నీవు యౌవనేచ్ఛల నుండి పారిపొమ్ము'' (2తిమోతి 2:22) అని కూడా బైబిలు హెచ్చరిస్తున్నది.

యోసేపు కూడా అదే చేశాడు. అతడు నేరారోపణ చేయబడ్డ లేక చెరసాలలో వేయబడ్డా కూడా పట్టించుకోలేదు గాని ఆ దురాశకు అప్పగించుకొనుటకు మాత్రం నిరాకరించాడు. అందుకే దేవుడు అతణ్ణి ఘనపరచాడు. బహుశా ఈ విషయంలో ఓడిపోవుటను బట్టే అనేకమంది యౌవనస్తులను ఈనాడు దేవుడు ఘనపరచలేకపోతున్నాడు.

స్వలింగ సంపర్కం

స్వలింగ సంపర్కం అంటే ఒకే జాతికి(లింగమునకు) సంబంధించిన ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య కలిగే లైంగిక ఆకర్షణ. లోతు సమయంలో దేవుడు సొదొమ గొమఱ్ఱాలను తీర్పు తీర్చిన పాపములలో ఇదొకటి. లేవీయకాండం 18:22 మరియు 1 కొరింథీ 6:9,10 వచనములలో ఇది నిశ్చయముగా ఖండించబడింది. ''ఇటువంటి అవాచ్యమైనది చేయట వలన తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి యెడలనొకరు కామతప్తులైరి'' (రోమా 1:26-27) అని స్వలింగ సంపర్కులను బైబిలు హెచ్చరిస్తుంది. స్వలింగ సంపర్కులకు కనికరం లేకుండా మరణ శిక్ష విధించవలెనని(లేవీయకాండం 20:13) పాత నిబంధనలోని ధర్మశాస్త్రంలో ఉంది.

ఒక విశ్వాసి ఇటువంటి స్వలింగ సంపర్కమునకు ఎంతో దూరంగా ఉండటం మాత్రమే కాక తన స్వంత జాతి (లింగము) వైపు ఎటువంటి అసహజమైన ఆకర్షణలు లేకుండా దూరంగా ఉండాలి. నిగూఢముగా స్వలింగ సంపర్క మనస్సు కలిగియున్న వారిని కూడా నిరోధించాలి. ఒకవేళ ఇప్పటికే నీవు ఈ చెడ్డ అలవాటులో చిక్కుకున్నట్లయితే, విడుదల కోసం ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధిని వెదకాలి మరియు అవతలి వారితో ఆరోగ్యకరమైన సంబంధమును కలిగియుండుటకు ప్రయత్నించాలి. ఒక పరిణితి చెందిన విశ్వాసిని సంప్రదించి, ప్రార్ధనా సహాయం కోరిన యెడల ఎంతో సహాయంగా ఉంటుంది.

శత్రువును జయించుట

మన దినములలో శృంగారమునకు సంబంధించి అనేక శోధనలున్నాయి. కుయుక్తి కలిగి సర్పము ఏవిధముగా మోసగించడానికి ప్రయత్నిస్తుందో, అపవాది కూడా గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని చూస్తున్నాడని బైబిలులో చెప్పబడింది. యౌవనస్తులను సుళువుగా చిక్కులలో పెట్టి వారి జీవితములను నాశనం చెయ్యడానికి లైంగిక విషయములను అపవాది ఎంచుకుంటాడు.

నిగ్రహం మరియు ఎల్లప్పుడూ మెళకువగా ఉండుటలోనే మన భద్రత ఉంది. స్వేచ్ఛను ఫణంగా పెట్టడమే ఎల్లప్పుడు మెలకువగా ఉండునట్లు చేస్తుంది అనేది ఈ విషయంలో కూడా అన్వయించబడుతుంది.

దేవుని వాక్యములోని ఆజ్ఞలు శత్రువు యొక్క ఉరి నుండి మనలను కాపాడుట కొరకు ఉన్నాయి. తన వాక్యంలో ముఖ్యంగా సామెతల గ్రంథంలో దేవుడు అనేక హెచ్చరికలు చేశాడు. ప్రతి యౌవనస్తుడు కూడా ఆ గ్రంథమును తరచుగా చదవాలి. కొందరు విశ్వాసులు రోజుకొక అధ్యాయము చొప్పున నెలకొకసారి సామెతల గ్రంథమును చదివే మంచి అలవాటును కలిగియుంటారు. ఇది శత్రువు యొక్క కదలిక గురించి మనలను ముందుగానే హెచ్చరిస్తుంది.

మనము జయము పొందాలని నిశ్చయించుకున్నట్లయితే, నిస్సందేహంగా మనము యుద్ధమును ఎదుర్కొనవలసి వస్తుంది. కాని మనం విడిచిపెట్టకూడదు. మనము ఇప్పటికే పడిపోయినట్లయితే, మన పాపములను మనము దేవుని యొద్ద ఒప్పుకుందాం. గతంలోని మన అపవిత్రమైన తలంపులన్నింటిని మరియు చెడ్డకార్యములను క్షమించుటకు ఆయన నమ్మదగినవాడు. లోతుగా పాపం చేసిన కొందరు వారు చేసిన పాపములు క్షమించబడినప్పటికీ దాని యొక్క పరిణామాలతో జీవించాలి. కాని మనం అంత లోతుగా పడిపోనట్లయితే, మనం మెళకువగా ఉందాం. తాను నిలుచున్నాననుకొను వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి(1 కొరింథీ 10:12) అని బైబిలు చెప్తుంది.

అన్ని సమయములలోను మనలను జయించుటకు నడపాలని దేవుడు కోరుకుంటున్నాడు(2 కొరింథీ 2:14). మన జీవితములలో ఆవిధముగా చేయునట్లుగా ఆయనను మనము నమ్ముదాము.         

Post a Comment

0 Comments